రచన: కాదంబరి
బహుళాదేవి, ఉత్తముడు (కథ- 1):—-
సుశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తూన్న రాజ్యాన్ని పరిపాలిస్తూన్న రాజు పేరు ఉత్తముడు. ఉత్తమ ప్రభువు భార్య పేరు బహుళాదేవి.వారి వివాహ సమయాన గ్రహముల పొందిక – సరిగా లేదు, అందుచేత రాణి స్వభావము విరుద్ధముగా మారినది.
ఒకరోజు వినోద సభ జరుగుతూన్నది. ఆ సభలో ఉత్తముడు “బహుళాదేవీ! ఈ ఫల పానీయము రుచిగా ఉన్నది. త్రాగుము!” అని ఇచ్చాడు. కానీ వైరుధ్య తత్వము ఏర్పడిన బహుళ మాత్రం- భర్త ప్రేమతో- తనకు ఇచ్చిన షర్బత్తును” నాకు అక్కర్లేదు, నేనది త్రాగను” అంటూ నిర్మొహమాటంగా తిరస్కరించినది.
నిండు సభలో ఉత్తమునికి, తన అర్ధాంగి వలన అవమానం కలిగింది. ఐనప్పటికీ ఆతడు కోపమును పంటిబిగువున ఆపుకుని, నిగ్రహముతో రాజ్య పాలనాది కార్యక్రమాలను నిర్వహించుకోసాగాడు. బహుళాదేవి ఎడమొగమూ, పెడమొహమూగా ఉండసాగింది. ఆమె ప్రతికూల వైఖరికి విసిగిపోయి”బహుళా! అరణ్యమే నీకు సరైన నివాసము” అని బహుళాదేవిని అడవులకు వెడలనంపాడు.
కానీ విచిత్రంగా ఆమె “ఈ దండనమే నాకు పరమానుగ్రహము” అనేసి, పానీయ పాత్రను పారవేసి, అటవీప్రాంతాలకు వెళ్ళిపోయినది. అదృష్టవశాత్తూ “నంద”అనే యక్ష కన్య కారడవులలో బహుళకు ఎదురైనది. నందాదేవి ఆమెకు తోడునీడగా నిలిచినది. తత్కారణముచేత బహుళాదేవి రసాతలమునకు చేరి, సురక్షితముగా ఉండసాగినది. భార్యా వియోగము కలిగిన ఉత్తముడు “నా పత్ని కారడవులలో ఎలాంటి బాధలు పడుతూన్నదో” అని మనసులో మధన పడసాగాడు.
**************************************************************************************************
విప్రవరుడు సుశర్మ భార్య అందముగా లేని స్త్రీ, ఐనప్పటికీ “నా భార్య అంద వికారి” అనే బాధ సుశర్మకు మనసులో కూడా ఎప్పుడూ కలగలేదు. అతను తన భార్యతో కలిసి, దైవ అర్చనలూ, పూజలూ, నిత్య విధులనూ నిర్వహిస్తూ, సంతృప్తితో కాలం గడుపుతూ ఉన్నాడు.
ఇలా ఉంటూండగా – సుశర్మ జీవితంలో అనుకోని ఆపద వాటిల్లినది. ఆ ద్విజోత్తముని అర్ధాంగిని దుష్టుడు అపహరించాడు. అందుచేత నిత్య విధులకు ఆటంకం ఏర్పడింది. సుశర్మ ప్రభువు సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు.
ఉత్తముడు “నీ భార్య కురూపి కదా! మరి ఎందుకు ఇంత క్రుంగిపోతావు? హాయిగా మరొక పడతిని- పెళ్ళి చేసుకుని సుఖంగా జీవించుము, బ్రాహ్మణుడా!” అన్నాడు.
కొలువుకూటములో పాలకుని నోట ఇలాటి వాక్కులు వినాల్సివస్తుందని అనుకోని ఆ ద్విజునికి ఇలాగ వింత పరిస్థితి ఎదురైనది. ధర్మ మార్గంలో నడుస్తూన్న ఆ ద్విజవరుడు “రాజా! ప్రభువు షడ్భాగ భోక్త, (shaDbhaaga bhOkta), తత్కారణముచే- పాలకునికి ప్రజా రక్షణము విహిత విధి” అంటూ హెచ్చరిక చేసాడు.
ఉత్తమ చక్రవర్తి మళ్ళీ సుశర్మకు చెప్పాడు “ఓ అమాయక బ్రాహ్మణుడా! కురూపి, దుశ్శీల అగు ఆమెకై నీవు ఇటుల విలపిస్తున్నావేమిటి? హాయిగా నీవు మళ్ళీ పెళ్ళి చేసుకుని, కొత్త భార్యతో సుఖించుమోయీ!”
నిర్లక్ష్య ధోరణితో కూడిన ఆ పాలకుని పలుకులు సుశర్మకు ఎంతో వ్యధ కలిగించాయి. ఓరిమితో సుశర్మ” సతిని ఎడబాయకూడదు, అది ఎంతో పాపకర్మము” అని సమాధానము చెప్పాడు. నిజాయితీతో కూడిన సుశర్మ మాటలతో ఉత్తమునికి కనువిప్పు కలిగింది. “అయ్యో! ఇన్నాళ్ళుగా నేను కర్మదూరుడను ఐతిని కదా!” అని తన తప్పును తాను తెలుసుకున్నాడు. ధర్మప్రవర్తనమును జనులలో ఉత్తేజపరచుట బ్రాహ్మణుని విధి, సుశర్మ ఉద్బోధలు ఉత్తమునిలో మనోపరివర్తనను కలిగించాయి. “ప్రజా సంక్షేమము- షడ్భాగ భోక్త ఐనట్టి ప్రభువు యొక్క నిత్య కర్తవ్యము” అని బోధపడినది. అంతే కాక ప్రభువు ఋజు మార్గ ప్రవర్తనతో అందరికీ ఆదర్శవంతునిగా, నీతి నిజాయితీలకు ప్రతీకగా – ధర్మ మూర్తిగా మెలగవలెను- అనే “తన విహిత ధర్మములు” ఉత్తమునికి అవగాహన ఐనవి.
అప్పుడు సుశర్మ భార్య ఎచ్చట ఉన్నదో వెదికించాడు రాజు. బలకాసురుడు అనే రాక్షసుని బారి నుండి, సుశర్మ భార్యను కాపాడాడు. సుశర్మ తన భార్యను సురక్షితంగా పొందుటకు కారణమైన ప్రభువుకు కృతజ్ఞతలు తెలిపి ఆశీస్సులను అందించాడు.
*****************************************************************************
మనువు చరిత్ర – (పార్ట్ -2 :– (continue) సుశర్మ భార్యను బలకాసురుడు అపహరించాడు. తమ దేశ చక్రవర్తి ఐనట్టి ఉత్తముడు వద్దకు వెళ్ళి, మొర పెట్టుకున్నాడు. రాజు
“అంద వికారి ఐన భార్యకై ఎందుకు బాధ పడతావు? నీకీ వగపేల? మళ్ళీ పెళ్ళి చేసుకుని, కొత్త పెండ్లాముతో సుఖించుము.” అని అన్నాడు.
ఆ మాటలకు నొచ్చుకున్న సుశర్మ “రాజా! సతిని బాయుట మహా పాపము!”అంటూ హితబోధ చేయగా, ఉత్తమునికి పశ్చాత్తాపము కలిగినది.
“నేను కర్మదూరుడను ఐతిని. దైవమా! నన్ను క్షమించు!” బాధ పడుతూ అనుకున్నాడు సైనికులను, గూఢచారులనూ రాజ్యం నలు మూలలకూ పంపించి గాలింపించాడు. ఆమె ఆచూకీ తెలిసిన వెంటనే, ఉత్తముడు రాక్షసునితో యుద్ధం చేసి ఓడించాడు.
పోరులో ఓడిపోయిన రక్కసుడు చెప్పాడు “మహా ప్రభూ! భార్య దూరమైనందున బ్రాహ్మణునికి ధర్మ కార్య నిర్వహణకు ఆటంకం ఏర్పడినది. ఆతని శాపానుగ్రహ శక్తి పోయినది. విప్రుని యొక్క మహాసుర నాశ కరోగ్ర మంత్ర ప్రభావము నిస్తేజము అయినది” అని తెలిపాడు.
అప్పుడు ఉత్తమునకు- “తన భార్య బహుళా దేవిని దూరం చేసుకున్నందువలన, తాను తన జీవితానందమును పోగొట్టుకున్నాను”- అనే తన లోటు తనకు బోధపడినది. విప్ర పత్నిని రక్షించి, అప్పగించిన బాధ్యత పూర్తి అవగానే- ఉత్తముడు తన అర్ధాంగిని అన్వేషణా కార్యక్రమంలో నిమగ్నమైనాడు.
ఉత్తముడు తన భార్య బహుళాదేవిని ఆగ్రహం వచ్చి, దుర్గమారణ్యాలకు వెళ్ళగొట్టాడు. అటవీప్రాంతాలలో దిక్కు తోచక, తిరుగాడుతూన్న బహుళా దేవిని, ఒక సర్ప రాజు చూసాడు. సాలపోతకుడు అనే ఆ సర్పరాజు ఆమెను గొంపోయి, అంతఃపురంలో బంధించాడు.
సర్పరాజు కుమార్తె నందా కుమారి. తన దుర్గతికి విలపిస్తూన్న బహుళను- “నంద కుమారి” చెరసాల నుండి విడిపించి, రక్షించినది. సాలపోతకునికి- తన కూతురిపై పట్టరాని కోపం వచ్చినది. తండ్రి శపించుట వలన, నందా కుమారి మూగది ఐనది.
బహుళాదేవినీ, నందాదేవినీ ఉత్తమ చక్రవర్తి కాపాడి, తన రాజ్యమునకు తీసుకువెళ్ళాడు. బహుళాదేవి తన భర్త ఉత్తమునితో “స్వామీ! నంద నన్ను ఇచ్చటకు వచ్చుటకై, నాకు సహాయము చేసినది. ఆమె నన్ను రక్షించుటవలన, తన తండ్రి కోపానికి గురి ఐనది. ఆమె తండ్రి శపించుటచే, నంద మూగదానిగా మారినది. కావున ఈమె మూకత్వమును పోగొట్టే మార్గమును చూడవలసినది” అని కోరింది. రాజు- ‘సారస్వతేష్టి ఫలమును ‘ ధారపోసి, నందకుమారి యొక్క- మూకత్వమును నశింపజేసాడు. నందకుమారికి తిరిగి వాక్కును పొందినది. తన పూర్వ శక్తులను, మహిమనూ కూడా నంద పొందినది. ఆమె రాజ దంపతులకు దీవెనలనొసగినది.
ఆమె వరప్రభావముతో బహుళాదేవీ ఉత్తమ దంపతులకు పుత్రుడు పుట్టాడు. ఈ కుమారుడే- కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన వారి వంశోద్ధారకుడు “ఉత్తమ మనువు”. స్వాయంభువ మను కులవర్ధనుడైన – ఉత్తమ మనువు గాధ చరిత్ర ప్రారంభ దశను వర్ణభరితమైనది.
(భార్యా భర్తల అనుబంధము అమూల్యమైనది. సమాజములో ఆ బంధము యొక్క విలువను సంరక్షించవలసిన అగత్యము ఉన్నది. మానవ జాతి ఈ బాంధవ్యాన్ని అపురూపంగా కాపాడుకోవడమంటే, అది సంఘ శ్రేయస్సును కాపాడడమే! ఆలుమగలు పవిత్ర బంధము యొక్క గొప్పదనమును నిరూపించే ప్రయత్నం చేసిన పురాణములలోని కథ)
story is very interesting. A new story i heard from our purnastories.
Thank you, SriHarsha!