written by ramyageethika
మాయలూ, మంత్రాలు, మహిమలు, భూతప్రేతాలు, అడుగడుగునా వింతశక్తులు, కళ్ళముందే మారిపోయే రూపాలు, చిత్రవిచిత్ర భవంతులు. అది మంత్రదండాలు చేతపుచ్చుకుని తిరుగుతున్న మంత్రగాళ్ళ ప్రపంచం. వింతలూ గారడీలు ఎప్పటికీ వినోదాలే! చిన్నపిల్లలంత కాకపోయినా పెద్దవాళ్ళకూ వాటిపట్ల ఉన్న సరదా తక్కువేంకాదు. అలాంటి సినిమాలూ అప్పుడూ ఇప్పుడూ ఆదరించబడుతూనే ఉన్నాయి!
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమందిని ఉత్కంఠ పరచిన మాయాలోకపు మంత్రగాళ్ళ కథే ‘హ్యారీ పాటర్’
జేకే రోలింగ్ రాసిన ఊహాత్మక నవల. దీంట్లో అక్షరరూపంలో ఉన్న ఆ మాయల మరాఠీలూ మాయాలోకమూ దృశ్యరూపంలోకి అందించిన వారు వార్నర్ బ్రదర్స్. డైరెక్టర్ క్రిస్ కొలంబస్, స్క్రీన్ ప్లే స్టీవ్ క్లౌస్. ఆ కథలో కథానాయడు హ్యారీ పాటర్ అనే ఢింభకుడు. సినిమాలో ఆ పాత్రలో జీవించిన పిడుగు డేనియల్ రాడ్ క్లిఫ్. 1997 నుండి 2007 వరకు ఒక్కోభాగం వరుసగా ఏడు పుస్తకాలుగా వచ్చింది. ఏడు సినిమాలుగా విడుదలయ్యాయి.
పదకొండేళ్ళ పిల్లవాడిగా పరిచయమైన హ్యారీ కథలో క్రమంగా యువకుడిగా మారతాడు. ఒక్కో సినిమా హ్యారీ జీవితంలో ఒక్కో సంవత్సరాన్ని చూపెడుతుంది. ఈ సీరిస్ లో మొదటి సినిమా “హ్యారీపాటర్ అండ్ ది సోసరర్స్ స్టోన్” లో చిన్న పిల్లవాడిగా ఉన్న రాడ్ క్లిఫ్ క్రమంగా ఎదుగుతూ ఏడవ సినిమా “డెత్లీ హాలోస్ “ లో పెద్దవాడిగా కనిపించి మన కళ్ళ ముందే ఎదిగిన పిల్లవాడిలా మన పక్కింటి అబ్బాయిలా మనసుకి దగ్గరౌతాడు.
సినిమాలో మిగతా పాత్రలు పోషించిన పిల్లలందరూ ఒక్కో సినిమాకి పెరిగి పెద్దౌతూఉంటే నిజంగా వాళ్ళని అన్నేళ్ళ నుండీ ఎరిగున్నట్టే అనుభూతి చెందుతాం. కథలోని పాత్రలు సన్నివేశాలకు కథకు తగ్గట్టుగా నిజంగానే పెరిగి పెద్దవారవటం చూడ్డానికి బావుంటుంది. ప్రతి సినిమాలో మరుక్షణం ఏం జరుగబోతుందోనన్న ఉత్కంఠ, అనూహ్య సంఘటనలూ, మలుపులూ ఉంటాయి. టక్కుటమారాలు, గారడీలు సంభ్రపరుస్తాయి. సాహసాలు, పోరాటాలు, స్నేహాలు సెభాస్ అనిపిస్తాయి.
ఇలాంటి సినిమాలకి కథనం ప్రాణం వంటిది, అన్ని మంత్రాల సినిమాల్లాగే ఇదీ కథనం తో ముందుకు సాగుతూ ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలకి సరైన బైండింగ్ లేదనిపించింది.
వోల్డ్ మోర్ట్ అనే దుష్టమాంత్రికుడు గొప్ప మాంత్రికులైన హ్యారీ తల్లిదండ్రులని చంపేస్తాడు. పసివాడైన హ్యారీని అతని అంకుల్ వద్దకు చేరుస్తారు శ్రేయోభిలాషులైన ఇతరమాంత్రికులు. పదకొండు సంవత్సరాల తరువాత హ్యారీ మంత్రవిద్యలు నేర్చుకోవటానికి మంత్రగాళ్ళ బడి హాగ్ వర్ట్స్ వెళతాడు అక్కడ ఒక్కో సంవత్సరం జరిగిన సంఘటనలే ఒక్కో సినిమా!
మొత్తం 7 హ్యారీ పాటర్ చిత్ర సమీక్షలు ఇక్కడ చదవండి .
- హ్యారీ పాటర్ అండ్ ది సోసరర్స్ స్టోన్
- హ్యారీ పాటర్ అండ్ ది చాంబర్ ఆఫ్ సీక్రెట్శ్
- హ్యారీ పాటర్ అండ్ ది ప్రిజనర్ ఆఫ్ అజ్కబన్
- హ్యారీ పాటర్ అండ్ ది గాబ్లెట్ ఆఫ్ ఫైర్
- హ్యారీ పాటర్ – ది ఆర్డర్ ఆఫ్ ఫీనిక్స్
-హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్ బ్లడ్ ప్రిన్స్
-హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్
(ఇంకా ఉంది)