by ; Kr geetika
కాగితం గుజ్జుతో పెన్ స్టాండ్ చేయటానికి కావలసిన వస్తువులు.
టిస్యూ పేపర్
ఫెవికాల్
టిస్యూపేపర్ రోల్( పేపర్ ఐపోయాక మిగిలిన అట్ట గొట్టం)
కలర్స్ (పోస్టర్ లేదా ఫ్యాబ్రిక్)
టిస్యూ పేపర్ అడుగున మిగిలిపోయే అట్ట గొట్టం పై కాగితం గుజ్జుతో వివిధ ఆకారాలను అమర్చి ఆ గొట్టాన్ని అందమైన పెన్ స్టాండ్ గా చేసుకోవచ్చు. పై బొమ్మలో అట్ట గొట్టం పై చిన్న చిన్న రాళ్ళ ఆకారంలో కాగితం గుజ్జును అమర్చాను.
* — మొదట టిస్యూ పేపర్ కి ఫెవికాల్ మరియు కొద్దిగా నీళ్ళతో (నీళ్ళు చాలా కొద్దిగా కాగితం మెత్తగా తడపటానికి చల్లాలి) కలిపి ముద్దగా చేసుకోవాలి. మామూలు కాగితం తో చేసేవారు దాన్ని ముక్కలుగా చేసి ఫెవికాల్ తో కలిపి కాసేపు నాన బెట్టాలి.
*– ఆ కాగితం గుజ్జుని చిన్న చిన్న రాళ్ళ ఆకారంలో చేస్తూ వాటిని పై బొమ్మలో వున్నట్టు అట్ట గొట్టం పై అమర్చాలి.
*– ఓ రోజంతా ఎండలో పెడితే అవి గట్టి పడి ఆ అట్టకి బాగా అతుక్కుపోతాయి.
*– చివరగా దానిపై రంగులు అద్దాలి. పై బొమ్మలో యాష్ కలర్ వేసాను. రంగు రంగుల రాళ్ళు లా రెండు మూడు రంగుల్లో కూడా వేసుకోవచ్చు.
మీ పెన్నులూ బ్రష్ లూ పెట్టుకోవడానికి అందమైన మీ పెన్ స్టాండ్ సిద్దం.
తప్పకుండా చేసి చూస్తారు కదూ. దీనికి మీ ఊహా శక్తిని జోడించి ఇంకా రకరకాల బొమ్మలూ చేయండి. చేసిన వాటి ఫొటో పంపించడం మర్చిపోవద్దు. చేసి చూద్దాం లో మీరు చేసిన వాటిని ప్రదర్శిద్దాం.

రమ్య గారు బావుంది. ఇదే గుజ్జు పారేసిన కొబ్బరి చిప్పల్ని (బాగా గుండ్రంగా ఉండాలి) మౌల్డుగా తీసుకుని వాటి చుట్టూ అద్ది చిన్న చిన్న గిన్నెలు చేసుకోవచ్చు. అలానే స్పూన్సు… పూలు…ఇక మన ఓపిక. నేను మామూలు కాగితంతోనే చేస్తాను. కాగితాలు నానబెట్టేటప్పుడు కాసిని మెంతులు కూడా కలిపి నానబెడితే బాగా జిగురు వస్తుంది.
సిరిసిరిమువ్వ గారు.
వీలైతే వీటి గురించి మీరు వివరంగా ఒక పోస్ట్ రాయగలిగితే సంతోషం.
మౌల్దుగా వేరే వస్తువు వాడినప్పుడు దాన్నుండి ఆ పేపర్ అచ్చు సులభంగా ఊడి వస్తుందా? దానికి నూనె లాంటిది ఏదైనా రాయాలా?
చిన్నప్పుడు మెంతులు న్యూస్ పేపర్లూ నానబెట్టి రుబ్బిన పేస్ట్ తో మేమూ చాలా రకాల బొమ్మలు చేసేవాళ్ళం. అవునండి మెంతులు కాగితాలు కలిపి చేస్తె దానికింక పెవికాల్ అక్కర్లేదు.