రచన : బిట్టు
బొమ్మ : బిట్టు

అనగా అనగా ఒక అడవిలో ఒక కోతి. అది ఓ రోజు నది వద్దకు షికారుకెళ్ళినప్పుడు అక్కడ పడిఉన్న గాడిదను చూసింది. గాడిద జ్వరంతో అక్కడ తెలివి లేకుందా పడి ఉంది. కోతికి దాన్నిచూస్తే జాలి వేసి ఇంటికి తీసుకునివచ్చి మందువేసి “ఎందుకు అక్కడ పడుకున్నావు?” అంటూ గాడిదను అడిగింది.
అప్పుడు గాడిద “నాకు ఎవరూ లేరు. జ్వరంలో నీళ్ళకోసం వచ్చి నీరసంతో అక్కడ పడిపోయాను. నా ఇల్లు పాతపడిపోయింది నిన్న కురిసిన వర్షానికి పూర్తిగా పడిపోయింది, ఇక నాకు బయట ఉన్నా ఇంట్లో ఉన్నా ఒక్కటే” అని చెప్పింది.
కోతికి దాన్ని చూస్తే చాలా జాలి వేసి “ఎవరూ లేరని బాధ పడకు మనం స్నేహితులుగా ఉందాం. ఇదిగో ఈ పక్క నున్న ఇల్లుకూడా నాదే ఇదివరలో దాంట్లో ఒక జింక అద్దెకి ఉండేది. ఇప్పుడా ఇల్లు ఖాళీగా ఉంది, నువ్వు ఇకపై ఆ ఇంట్లో ఉండు అద్దె ఇవ్వక్కర్లేదు.” అని చెప్పింది.
గాడిద తన పాత ఇంటికి వెళ్ళి కోతి సాయంతో తన సామాను తెచ్చుకుని కోతి ఇచ్చిన ఇంట్లో ఉండసాగింది.
ఓనాడు గాడిద బయటకు వెళ్ళి వస్తూ ఇంటి తాళంచెవి ఎక్కడో పోగొట్టుకుంది. ఇంటి ముందు కూర్చుని “అయ్యో తాళంచెవి పోయిందే ఇప్పుడు నేను ఇంట్లోకి ఎలా వెళ్ళడం!” అని దిగులు పడుతూ ఉండింది.
అప్పుడే కోతివచ్చి “ఏం జరిగింది? ఎందుకలా దిగులుగా ఉన్నావు?” అని గాడిదని అడిగింది.
కోతిబావ ఇంటి తాళంచెవి ఎక్కడో పోగొట్టుకున్నాను. అదిలేకుండా తలుపుతీయటం అసాధ్యమైన పని. ఇప్పుడెలా?” అంటూ ఏడవటం మొదలెట్టింది గాడిద.
దానికి కోతి ఇంటికి వెళ్ళి ఈ తాళంచెవి తెచ్చి ఇచ్చి “మరేం పరవాలేదు ఈ తాళంచెవి తీసుకో, ఇకపై ఇది వాడుకో.” అనిచెప్పింది. అది గాడిద ఇంటి తాళానికే మరొక తాళంచెవి.
తెలివి తక్కువ గాడిదకు అది తెలియలేదు. ఆ తాళంచెవి కోతి ఇంటిదని అనుకుంది. దానికి ఒక చెడు ఆలోచన కలిగింది. కోతి బయటకు వెళ్ళినప్పుడు ఈ తాళంచెవి సహాయంతో దాని ఇంట్లోకి వెళ్ళి కోతి ఇంటిని దోచుకుని పోవాలి అనుకుని సమయం కోసం చూడసాగింది.
ఓ రోజు కోతి గాడిద ఇద్దరు కలిసి షికారుకి బయల్దేరారు. సగం దూరం వెళ్ళగానే గాడిద “అబ్బా కోతిబావ నాకు పొట్టలో నెప్పిగా ఉంది షికారుకి రాలేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను నువ్వెళ్ళు” అని చెప్పి తిరిగి వచ్చేసింది.
గాడిద సరాసరి కోతి యొక్క ఇంటికి పోయి తన తాళంచెవితో తాళంతీయటానికి ప్రయత్నించింది.
ఆ తాళంచెవి కోతి ఇంటిది కాదుగా అందుకే అది తాళంలో ఇరుక్కుపోయింది.
గాడిద దాన్ని అటు ఇటు లాగేసరికి అది విరిగి తాళంలోనే ఇరుక్కుపోయింది. గాడిదకు భయం వేసింది. కోతివచ్చిందంటే జరిగిందంతా తెలుసుకుని నన్ను బతక నివ్వదు అనుకుంది. తన ఇంటికేమో తాళం వేసుంది ఇంకో మార్గంలేక తన సామానంతా వదిలేసుకుని పారిపోయింది.
జాలిపడి స్నేహం చేసిన కోతిని మోసం చేయాలనుకున్న గాడిదకు తగిన శాస్తి జరిగింది.
good story.